Harish Rao: కాంగ్రెస్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణం 8 d ago

TG: 2025 మార్చి నెల తెలంగాణ GST వృద్ధి 0%కు పడిపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సగటు GST వృద్ధి రేటు 10% ఉండగా, తెలంగాణ రాష్ట్రం దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా వెనకబడి ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. GST వృద్ధి 12.3%గా ఉందని శాసనసభలో ప్రకటించడం శోచనీయం అని వెల్లడించారు. కాగా, అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఆర్థిక మంత్రి వాదనలు పూర్తిగా అవాస్తవమైనవిగా తేలిపోయాయని వారు స్పష్టం చేశారు.
'బడ్జెట్ సమావేశాల్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించి, తెలంగాణ GST వృద్ధి రేటు 5.5%కు పరిమితమవుతుందని హెచ్చరించాను. మా సలహాలు, హెచ్చరికలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన దుయ్యబట్టారు. కాగా, ప్రస్తుతం అధికారికంగా తెలంగాణ వృద్ధి రేటు కేవలం 5.1% మాత్రమేనని ధృవీకరించబడిందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంత తక్కువ GST వృద్ధి ఇప్పటివరకు ఎన్నడూ నమోదు కాలేదు, కోవిడ్-19 లాక్ డౌన్ కాలంలో తప్ప. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం' అని ధ్వజమెత్తరు.
రాష్ట్ర వృద్ధి రేటు క్రమంగా తగ్గడానికి గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణమని మాజీ మంత్రి ఆరోపించారు. "క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలులో లోపాలు, రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించకపోవడం, రైతు భరోసా పథకం కింద రూ.12,000 కోట్ల నిధులు విడుదల చేయకపోవడం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిపోయింది. అదేవిధంగా హైడ్రా, మూసీ ప్రాజెక్టుల వంటి తప్పుడు విధానాలతో భయాందోళనలు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడం, ఫార్మా సిటీ, మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతింది" అని హరీష్ రావు ఎక్స్ లో వెల్లడించారు.